 
															మత్తు పదార్థాలపై నిఘా ఉంచాలి
● ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్
● గీసుకొండ పోలీస్‌స్టేషన్ తనిఖీ
గీసుకొండ: పోలీసు అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సమర్థవంతంగా సేవలను అందించాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ కుమార్ (సాంగ్వార్) అన్నారు. మంగళవారం ఆయన గీసుకొండ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేలా పనిచేయాలని, రికార్డులను ఎప్పటికప్పుడు సరిగా నిర్వహించాలని, నిషేధిత మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. మండలంలో దొంగతనాలు, ఈవ్ టీజింగ్, పబ్లిక్ న్యూసెన్స్ జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. టెక్ టీం పని తీరును పరిశీలించారు. పోలీసు సిబ్బందికి డ్యూటీ సమయంలో సరైన విశ్రాంతి, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, విధుల్లో ఉత్సాహాన్ని నింపే చర్యలు చేపట్టాలన్నారు. గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్సైలు కుమార్, రోహిత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
