
భూగర్భ జలాలు ౖపైపెకి..
సాక్షి, వరంగల్: ఈ వానాకాలంలో ఆశాజనకంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టాలు పైకి ఉబికాయి. జూన్‌లో సగటున 5.98 మీటర్ల లోతులో ఉన్న నీరు జూలైలో 5.66 మీటర్లు, ఆగస్టులో 3.14 మీటర్లకు పైకి ఎగబాకిన భూగర్భ జలమట్టాలు.. సెప్టెంబర్‌లో 2.61 మీటర్లకు సగటున వచ్చి చేరాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురవాల్సి వాన కంటే అధికంగా వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలమట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ వానలతో చెరువులు, కుంటలు, వాగులు నిండి ఆయా ప్రాంతాల్లోని భూగర్భ జలాలు పైకి ఎగబాకాయి. దాంతో ఈ ఏడాది వ్యవసాయానికి సాగునీటికి ఢోకా లేదు. కానీ, పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు మాత్రం అదనపు వర్షంతో కొంతమేర నష్టం వాటిల్లింది. జిల్లాలో 2,84,375 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా 2,53,420 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. పత్తి 1,18,106, వరి 1,03,160, మొక్క జొన్న 13,654, ఇతర పంటలు 18,500 ఎకరాల్లో సాగవుతున్నాయి.
అదనంగా వర్షాలు
జూన్‌లో 153.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 113.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో 271.9 మిల్లీమీటర్లకు 312.8 మిల్లీమీ టర్ల వాన కురిసింది. అంటే జూన్‌లో లోటు వర్షపాతం ఉండగా, జూలైలో 15 శాతం అదనంగా వర్షం కురిసింది. ఆగస్టులో 248.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 390.8 మిల్లీమీటర్ల వాన కురిసింది. సెప్టెంబర్ నెలలో 174.9 మిల్లీమీటర్ల వర్షానికి 245.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూసుకుంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు కలుపుకుంటే 854 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 1,102.4 మిల్లీమీటర్లు కురిసింది.
జూన్‌లో 5.98 మీటర్లలో
భూగర్భ జలమట్టం
తాజాగా 2.61 మీటర్లపైకి
ఎగబాకిన నీరు
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు
అదనపు వానలతో సాగునీరుకు నిశ్చింత
మండలం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్
చెన్నారావుపేట 1.46 0.32 0.12 0.01
దుగ్గొండి 4.71 3.53 0.21 0.15
గీసుకొండ 5.03 4.67 1.26 0.61
ఖానాపురం 3.34 2.92 0.69 1.06
నల్లబెల్లి 7.70 7.33 1.25 0.97
నర్సంపేట 4.97 4.10 1.15 1.60
నెక్కొండ 2.85 0.48 0.19 0.43
పర్వతగిరి 11.65 13.51 7.66 6.58
రాయపర్తి 8.06 9.63 7.05 4.17
సంగెం 3.58 3.12 2.26 2.52
వర్ధన్నపేట 8.30 7.33 5.65 5.52
వరంగల్ 2.22 1.81 1.21 1.27
ఖిలా వరంగల్ 4.65 3.87 1.70 0.32