
‘బీఏఎస్’ బిల్లులు చెల్లించండి
● విద్యార్థులను పాఠశాలలోకి రానివ్వని యాజమాన్యం
● ప్రభుత్వం స్పందించాలని రోడ్డెక్కిన బీఏఎస్ విద్యార్థుల తల్లిదండ్రులు
నెక్కొండ: ప్రభుత్వం బీఏఎస్ బిల్లులు చెల్లించలేదని మండల కేంద్రంలోని విద్యోదయ బెస్ట్ అవైలబుల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించక పోవడంతో వారి తల్లిదండ్రులు స్థానిక అంబేడ్కర్ సెంటర్‌లో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీఏఎస్ విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు సీపీఐ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు మాట్లాడారు. ప్రభుత్వం మూడేళ్లుగా బీఏఎస్ నిధులు విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదలలో జాప్యాన్ని మంత్రులు, సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే బీఏఎస్ యాజమాన్యం మొండికేసిందని వాపోయారు. మూడేళ్లుగా బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో తమ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక పోతున్నామని, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్స్ వంటివి సమకూర్చుకోవడం కష్టంగా మారిందని బీఏఎస్ స్కూల్ యాజమాన్యం చెబుతోందని అన్నారు. పిల్లల చదువులు సక్రమంగా సాగకపోతే ప్రభుత్వం దిగి వచ్చే వరకు దశల వారీగా ఆందోళనలు చేపడుతామని వారు హెచ్చరించారు. సమాచారం తెలుసుకుని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు.