
బస్సుల కోసం పడిగాపులు
పరకాల: బతుకమ్మ, దసరా సెలవులు ముగియడంతో పరకాల ఆర్టీీసీ బస్టాండ్‌లో రద్దీ నెలకొంది. సొంతూళ్లకు వచ్చిన వారు తిరిగి పట్టణాలు, నగరాలకు బయలుదేరుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాకపోవడం, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రభుత్వం కల్పించడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా బస్టాండ్ కిటకిటలాడుతోంది. సుమారు 100 గ్రామాలు, వేలాది మంది ప్రయాణికులకు ప్రధాన కేంద్రంగా ఉండే పరకాల బస్టాండ్ తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. కానీ, సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పరకాల డిపో నుంచి వెళ్తున్న బస్సుల్లోనే సీట్లు ఉంటున్నాయి. భూపాలపల్లి డిపో బస్సుల్లో ఒక్క సీటు కూడా దొరకడం లేదు. తప్పనిపరిస్థితుల్లో కొంతమంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు స్పందించి పండుగ సీజన్‌లో ఆర్టీసీ బస్సులను పెంచి ఇబ్బందులు తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.