
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
● కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఎన్నికల నిర్వహణకు నియమించిన జోనల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీంతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు చట్టబద్ధంగా సిబ్బంది పనిచేయాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల సంఘం నియమావళిని, నిబంధనలను ఆకలింపు చేసుకొని సంబంధిత విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. జోనల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఫర్నిచర్, మరుగుదొడ్లు, లైటింగ్, వెబ్ కాస్టింగ్ తదితర కనీస సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని, రూట్ మ్యాపింగ్ చేసుకోవాలన్నారు. జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు సమన్వయంతో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదించాలన్నారు. పోలింగ్ సిబ్బందిని సురక్షితంగా చేర్చడం, పోలింగ్ పూర్తయిన తర్వాత మెన్ అండ్ మెటీరియన్ రిసెర్షన్ సెంటర్‌లో చేర్చే బాధ్యత జోనల్ అధికారులపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, అక్రమ ప్రచారాలు వంటి ఉల్లంఘనలపై ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు నిరంతరం నిఘా పెట్టి, తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీసీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, డీబీసీడీఓ పుష్పాలత, డిప్యూటీ సీఈఓ వాసుమతి, జోనల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నారు.