
జిల్లాలో మోస్తరు వర్షం
నెక్కొండ మండలం సీతారాంపురంలో మత్తడి పోస్తున్న మాటు
● జలకళ సంతరించుకున్న చెరువులు, కుంటలు
● సగటు వర్షపాతం 36.61 మిల్లీమీటర్లు
సాక్షి, వరంగల్: జిల్లాలో మళ్లీ వాన దంచికొట్టింది. 9 మండలాల్లో మోస్తరు వర్షం, మిగిలిన నాలుగు మండలాల్లో తేలికపాటి జల్లులు కురి శాయి. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు జిల్లాలో 36.61 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వర్షాలతో మొక్కజొన్న చేనులోనే కంకులు మొలకలు వస్తున్నాయి. పత్తి పంట జాలువారి ఎర్రగా మా రుతోంది. దీంతో 50 శాతం మేర పంటలు దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మండలాల వారీగా వర్షపాతం వివరాలు..
జిల్లాలో అత్యధికంగా గీసుకొండలో 59.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్‌లో 58.2, ఖిలా వరంగల్‌లో 52.8, దుగ్గొండిలో 36.5, వర్ధన్నపేటలో 34.3, నల్లబెల్లిలో 24.6, సంగెంలో 20.9, రాయపర్తిలో 16.5, ఖానాపురంలో 16.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, నర్సంపేటలో 14.5 మిల్లీమీటర్లు, చెన్నారావుపేటలో 11.8, నెక్కొండలో 10.7, పర్వతగిరిలో 9.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
816 జలాశయాల్లోకి నీరు..
ఈ నెల తొలివారంలో కురిసిన వర్షంతో అన్ని ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 816 జలాశయాలు నిండాయి. ఇటీవల కురుస్తున్న మోస్తరు వర్షాలతో వర్ధన్నపేట మండలంలోని 68 చెరువులు, రాయపర్తిలో 96 చెరువులు, నెక్కొండలో 81 చెరువులు, ఖానాపురంలో 23 చెరువులు, నర్సంపేటలోని 67 చెరువులు, చెన్నారావుపేటలోని 45 చెరువులు, పర్వతగిరిలోని 63 చెరువులు, సంగెంలోని 73 చెరువులు, నల్లబెల్లిలోని 84 చెరువులు, దుగ్గొండిలోని 73 చెరువులు, గీసుకొండలోని 76 చెరువులు, వరంగల్‌లో 20 చెరువులు, ఖిలావరంగల్‌లోని 47 చెరువుల్లో వందశాతం నీరు వచ్చి చేరిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.