హన్మకొండ అర్బన్: భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ద్వారా అందించే స్కీంలను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వొద్దని కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.ఉప్పలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో బీసీడబ్ల్యూయూ వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ అధ్యక్షతన హనుమకొండ కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ జూలై 22న జీఓ 12 విడుదల చేసి, రెండు రోజుల్లోనే రూ.346 కోట్లను ప్రైవేట్ ఇన్సూరెన్‌్స్ కంపెనీలకు బదిలీ చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర కార్మికులు తీవ్రంగా ఖండిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే జీ12 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవన నిర్మాణ కార్మికులను సమీకరించి రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతామని హెచ్చరించారు. యునైటెడ్ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న, ఉపాధ్యక్షులు పుల్లా అశోక్, ఆలకుంట యాకయ్య, రాధ, స్వప్న, సారంగపాణి, సుధాకర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొమరయ్య, బ్రహ్మచారి, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.