
సమగ్ర సస్యరక్షణతో అధిక దిగుబడి
● డాక్టర్ విజయభాస్కర్
సంగెం: పంటలపై వచ్చే చీడపీడలు, తెగుళ్ల నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి పొందవచ్చని రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ విజయభాస్కర్ అన్నారు. మండలంలోని గవిచర్ల, ఆశాలపల్లి, గ్రామాల్లోని పత్తి, వరి, కూరగాయలు, ఆకుకూరలు, పూల పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పస్తుత పరిస్థితుల్లో వడలు తెగులు నివారణకు కాపర్‌ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క మొదలు తడిసేలా పిచికారీ చేసుకోవాలని సూచించారు. కాయకుళ్లు నివారణకు గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ పదిలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని చెప్పారు. రసం పీల్చే పురుగుల నివారణకు 1500 పీపీఎం వేపనూనె ఎకరాకు లీటరు, లేదా 300 గ్రాముల అసిపేట్ లేదా ప్లునికామైడ్ 50మీ.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. వరిలో కాండం తొలుచుపురుగు నివారణకు క్లోరాంట్రనిలిప్రోలు 0.3 మిర్లీ లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలని తెలిపారు. కాకరలో పండు ఈగ నివారణకు లింగాకర్షణ బుట్టలను ఎకరాకు 2–4 చొప్పున ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త వెంకటరాజ్‌కుమార్, ఏఓ జ్యోత్స్న భవాని, ఏఈఓ సాగర్, రైతులు పాల్గొన్నారు.