
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
● జెడ్పీ సీఈఓ రవినాయక్
ఎల్కతుర్తి: హాస్టళ్ల నిర్వహణలో వార్డెన్లు నిర్లక్ష్యం వహించకూడదని జెడ్పీ సీఈఓ రవినాయక్ అన్నారు. భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు బాలికల, ఎస్సీ వసతి గృహాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, ఆహార పదార్థాలు, దినసరి మెనూ, మరుగుదొడ్లు, పడుక గదులను పరిశీలించారు. విద్యార్థులు తినే ఆహారం నాణ్యంగా ఉండాలని వార్డెన్లకు సూచించారు. వసతి గృహాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముల్కనూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ వీరేశం, పంచాయతీ కార్యదర్శి పూర్ణచందర్ తదితరులు ఉన్నారు.