
మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల: కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి పరకాల ఇందిరా మహిళా డెయిరీ స్థాపించనున్నట్లు తెలిపారు. ఆడబిడ్డల రుణం తీర్చుకోవడం కోసమే డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దామెర, ఆత్మకూరు, నడికూడ, పరకాల మండలాల గ్రామస్థాయి, ప్రాదేశిక స్థాయి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు అవగాహన, సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డెయిరీ ఆవశ్యకత, నిర్మాణం, యజమాని బాధ్యతలు, పాలఉత్పత్తి, పాల మార్కెటింగ్‌పై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వ సహకారం, అధికారుల కృషితో రాజకీయాలకతీతంగా పరకాల డెయిరీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక ఆర్థికపరమైన వ్యాపారం మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే మహాయజ్ఞంగా భావించాలని కోరారు. సమాజానికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడమే పరకాల మహిళా డెయిరీ ఒక ముఖ్య కారణమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి మహిళను ఒక పారిశ్రామిక వేత్తగా చేయాలనే సంకల్పంతో ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. సదస్సులో డీఆర్‌డీఓ శ్రీను, ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, అధికా రులు, మహిళాసమాఖ్య నాయకులు ఉన్నారు