ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Sep 12 2025 5:49 AM | Updated on Sep 12 2025 4:37 PM

హన్మకొండ అర్బన్‌: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్మోహన్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హనుమకొండ కలెక్టరేట్‌ ప్రాంగణంలోని టీజీఓ భవన్‌లో గురువారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీజీఓ, టీఎన్జీఓ, ఇతర సంఘాలకు గుర్తింపునిస్తూ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లపై సీఎం చేసిన వ్యాఖ్యలు కొంత బాధించాయని గుర్తు చేశారు. 

ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం విధి విధానాల్ని రూపొందించాలని, రెండేళ్లుగా పెండింగ్‌లో బిల్లుల చెల్లింపులకు గ్రీన్‌చానల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే జేఏసీ పక్షాన ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. టీజీఓ జిల్లా అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాసకుమార్‌, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, వరంగల్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాంరెడ్డి, ఫణికుమార్‌, కేంద్ర సంఘం కార్యదర్శులు కిరణ్‌కుమార్‌, కోలా రాజేశ్‌కుమార్‌, ఆస్నాల శ్రీనివాస్‌, కోశాధికారి రాజేశ్‌కుమార్‌, ఉపాధ్యక్షులు అన్వర్‌ హుస్సేన్‌, మాధవి, భాగ్యలక్ష్మి, కృష్ణ్ణవేణి, మాధవరెడ్డి, రఘుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మత్తు కట్టడికి పటిష్ట చర్యలు రేపు

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేశ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా పాఠశాల విద్యాశాఖ రూపొందించిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధించిన నినాదాల పట్టికను డీఆర్‌ఓ, డీసీపీ ఆవిష్కరించారు. సమావేశంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా, హనుమకొండ, కాజీపేట, పరకాల ఏసీపీలు నరసింహారావు, ప్రశాంత్‌రెడ్డి, సతీశ్‌బాబు, టీజీఏఎన్‌బీ డీఎస్పీ రమేశ్‌కుమార్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీఐఈఓ గోపాల్‌, డీడబ్ల్యూఓ జయంతి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డాక్టర్‌ అనితారెడ్డి, డాక్టర్‌ ప్రహసిత్‌, డాక్టర్‌ ఆచార్య రవికుమార్‌ పాల్గొన్నారు.

సెమినార్‌ 

వరంగల్‌ లీగల్‌: ‘యాంటీ కరప్షన్‌ చట్టాలు–ప్రాక్టీస్‌ అండ్‌ ప్రొసీజర్‌’పై నగరంలోని డీసీసీబీ భవన్‌లో శనివారం సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు న్యాయవాది పరిషత్‌ వరంగల్‌, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు చొల్లేటి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెమినార్‌కు ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్‌, గౌరవ అతిథులుగా ఉభయ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, కె.పట్టాభిరామారావు, న్యాయవాది పరిషత్‌ జోనల్‌ ఆయమ్‌ ప్రముఖ్‌ కరూర్‌ మోహన్‌, ఉభయ జిల్లాల బార్‌ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్‌, సత్యనారాయణ, న్యాయవాది కేవీకే గుప్తా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

కేయూ క్యాంపస్‌: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో శారీరక దారుఢ్యం మానసికోల్లాసం కలుగుతుందని కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం అన్నారు. గురువారం కేయూలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల డిగ్రీ, పీజీ కళాశాలల కాలేజీఝెట్‌ పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా రిజిస్ట్రార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమని క్రీడాస్ఫూర్తితో క్రీడాపోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ మనోహర్‌ మాట్లాడుతూ.. మొత్తం 22 టీంలు పాల్గొంటున్నాయని ఈనెల 12న కూడా కొనసాగుతాయని తెలిపారు.

ఉద్యోగుల సమస్యలు  పరిష్కరించాలి1
1/1

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement