
ప్రజలకు ఇబ్బందిలేకుండా నీరందించాలి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట : కాల్వ పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టి గ్రామస్తులకు, రైతులకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరా కొనసాగించాలని వర్ధన్నపేట ఎమ్మె ల్యే నాగరాజు ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. మండలంలోని బండౌతాపురం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెగిపోయిన కట్టకాల్వను అధికారులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. కొనారెడ్డి చెరువును నింపి రైతుల ఇబ్బందులు తొలగిస్తామని, వర్ధన్నపేట – కొనారెడ్డి చెరువుకి వచ్చే కట్టకాల్వకు శాశ్వత మరమ్మతులు చేపిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చెరువులపై కమీషన్లు దండుకుందేతప్పా చెరువులను పునరుద్ధ రించలేదని ఆరోపించారు. కట్టకాల్వ తెగిన ప్రదేశాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో శాశ్వత మరమ్మతులు చేపించి బండౌతాపురం గ్రామ రైతులకు సైతం పొలాల వద్దకు వెళ్లేందుకు బ్రిడ్జి మార్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. యూరి యా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకపోవడంతో యూరియా కొరత ఏర్పడిందని, సీఎం రేవంత్‌రెడ్డి సరైన సమయంలో స్పందించి యూరియాను రైతులకు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.