అంగన్‌వాడీల్లో ‘పోషణ్‌ వాటిక’ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో ‘పోషణ్‌ వాటిక’

Sep 10 2025 1:58 AM | Updated on Sep 10 2025 1:58 AM

అంగన్‌వాడీల్లో ‘పోషణ్‌ వాటిక’

అంగన్‌వాడీల్లో ‘పోషణ్‌ వాటిక’

సాక్షి, వరంగల్‌: అంగన్‌వాడీల్లో పోషణ్‌ వాటిక అమలుకు జిల్లా సంక్షేమ విభాగాధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య బోధించడంతో పాటు పోషకాహారం అందిస్తున్నా... వారికి సంపూర్ణ పౌష్టికాహారం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. తొలుత జిల్లాలోని 54 కేంద్రాల్లో కూరగాయల తోటలు పెంచేందుకు ఉద్యానశాఖ అధికారుల మార్గదర్శనంలో ముందుకెళ్తుతున్నారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి సంబంధిత సీడీపీఓలతో పాటు ఉద్యానశాఖ అధికారులకు లేఖలు పంపిస్తున్నారు. తొందరగా ఇది అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కోకేంద్రానికి మంజూరైన రూ.పది వేలతో మైదానం చదును చేయడంతో పాటు సారవంతమైన మట్టి, ఎరువు కోసం ఖర్చు చేయనున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలు పండించి అదే కేంద్రాల్లో తయారు చేసే వంటకాల్లో వినియోగిస్తారు. తొలి విడతలో టమాటా, వంకాయ, బెండ, ముల్లంగి, బీరకాయ, గోంగూర, పాలకూర, తోటకూర, మెంతికూరలను పండించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటి విత్తనాలను జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీ చేయనుంది. జిల్లా ఉద్యానశాఖ అధికారులు ఆయా కేంద్రాలను సందర్శించి సాగుకు అవసరమైన సౌకర్యాలు కల్పించి మొక్కల పెంపకాన్ని పర్యవేక్షించనున్నారు. దీంతో అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందనుంది.

జిల్లాలో 919 అంగన్‌వాడీలు

జిల్లాలో 919 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో సొంత భవనాలు 165, అద్దె భవనాలు 426, ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నవి 328 కేంద్రాలున్నాయి. 0 నుంచి ఆరేళ్ల చిన్నారులు 47,625 మంది ఉంటే, బాలింతలు 3,714 మంది, గర్భిణులు 5,415 మంది ఉన్నారు. వీరికి ప్రస్తుతం కూరగాయలు కొనుగోలు చేసి వంట తయారుచేసి అందిస్తున్నారు. నగర పరిధిలో అక్షయపాత్ర వంటి సంస్థలు లబ్ధిదారులకు రాయితీపై భోజన సదపాయం కల్పిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు పెరిగిన సందర్భంలో ప్రభుత్వం కేటాయించే నిధులు సరిపోవడం లేదు. దీంతో కొన్ని సందర్భాల్లో ఆరోగ్యకరమైన ఆహారం అందక ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. వీటిని గుర్తించిన ప్రభుత్వం సేంద్రియ పద్ధతి సాగు ద్వారా ఆకుకూరలు వారే పండించుకొని వంటకాల్లో ఉపయోగించడం ద్వారా ఎక్కడా లోటుపాట్లు ఉండవని గుర్తించి ఆ దిశగా తొలుత జిల్లాలోని 54 అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5,40,000లు మంజూరు చేసింది.

దశల వారీగా అమలు చేస్తాం..

అంగన్‌వాడీల్లో తొలుత రూ.10 వేలతో పోషణ్‌ వాటికలను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు రూ.16 వేలతో ఇంకుడుగుంతలు, రూ.39 వేలతో చిన్నారులకు ఆట వస్తువులు, రూ.25 వేలతో ఎల్‌ఈడీ స్క్రీన్లు, రూ.10 వేలతో తాగునీటి యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపించాం. జిల్లాలో తొలుత 54 కేంద్రాల్లో పోషణ్‌వాటికను అమలు చేస్తున్నాం. ఆ తర్వాత దశల వారీగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో బలోపేతం చేస్తాం.

– రాజమణి, జిల్లా సంక్షేమ విభాగాధికారి

జిల్లాలోని 54 కేంద్రాల్లో

కూరగాయల సాగు

ఉద్యానశాఖ అధికారుల

సహకారంతో పనులు

లబ్ధిదారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించే దిశగా అడుగులు

తప్పనున్న కూరగాయల కొనుగోలు బాధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement