
ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
నల్లబెల్లి: అధికారి వేధింపులు.. అధికార పార్టీ నాయకుడి ఫిర్యాదు వెరసి ఓ జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ కార్యాలయంలో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండలం బజ్జుతండాకు చెందిన కల్పన పదేళ్లుగా వీఆర్‌ఏ, జూనియర్ అసిస్టెంట్‌గా విధులు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో పలు సర్టిఫికెట్ల జారీ కోసం విచారణ నివేదికను తహసీల్దార్ ముప్పు కృష్ణకు అందించేవారు. ఈక్రమంలో పలువురు దరఖాస్తుదారులు తమకు అనుకూలంగా విచారణ రిపోర్ట్ రాలేదని కక్ష పెంచుకున్నట్లు బాధితురాలు తెలిపారు.
ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు..
మండలంలొని బిల్‌నాయక్ తండాకు చెందిన అధికార పార్టీ నాయకుడు, కల్పన మేనమామ మాలోత్ చరణ్‌సింగ్.. ఆమైపె శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్ సత్యశారదకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు కాపీని కల్పన వాట్సాప్‌నకు మేడపల్లి మాజీ ఎంపీటీసీ భర్త మాలోత్ మోహన్ పంపించాడు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన చరణ్ సింగ్ గతంలో తనను లైంగికంగా వేధించాడని, అతడికి లొంగకపోవడంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నాడని కల్పన పేర్కొంది. గతంలో ఒక తప్పుడు సర్టిఫికెట్ కోసం పురుషోత్తం సురేశ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే మనిషిని అని బెదిరించారని కల్పన పేర్కొంది. కాగా.. కలెక్టర్‌కు అందిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కృష్ణ ఆమెతో చర్చించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తితో మాట్లాడుకుని రాజీ కుదుర్చుకోమని చెప్పినట్లుగా కల్పన పేర్కొంటున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తహసీల్దార్ వెంటనే ఆమెను తన కారులో నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
వేధించలేదు..
జూనియర్ అసిస్టెంట్ కల్పనను నేను వేధింపులకు గురి చేయలేదు. కల్పనపై పలు ఆరోపణలు చేస్తూ ఇటీవల ఓ వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కల్పనతో మాట్లాడాను. ఏం కాదు ధైర్యంగా డ్యూటీ చేసుకొమ్మని సూచించాను. కార్యాలయానికి వచ్చే వారిపై మర్యాదగా వ్యవహరించాలని సూచించాను. వేధింపులకు పాల్పడలేదు.
– ముప్పు కృష్ణ, తహసీల్దార్, నల్లబెల్లి
అధికారి వేధింపులు!
అధికార పార్టీ నాయకుడి ఫిర్యాదు
బలవన్మరణానికి యత్నించిన జూనియర్ అసిస్టెంట్ కల్పన