
కమీషన్ల మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు
● మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
ధర్మసాగర్: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వచ్చే కమీషన్ల మీద ఉన్న ప్రేమ రైతులపై లేదని మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. రైతన్న కోసం రాజన్న పాదయాత్రలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్, గుంటూరుపల్లి, ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి, ధర్మపురం, చిల్పూరు మండలంలోని వంగాలపల్లి, నష్కల్, ఉప్పుగల్లు రిజర్వాయర్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం రిజర్వాయర్ సమీపంలో కాంగ్రెస్ పార్టీకి, కడియం శ్రీహరికి పిండాలు పెట్టారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి అభివృద్ధి పేరు చెప్పుకొని తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తూతూ మంత్రంగా శంకుస్థాపనలు చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల రైతులకు సాగునీరు అందించడానికి నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేవాదుల రిజర్వాయర్ నిర్మించిందని తెలిపారు. ఉప్పుగల్లు రిజర్వాయర్ ద్వారా దాదాపు పది గ్రామాల్లోని రైతుల భూములకు సాగునీరు అందించడానికి కేసీఆర్ నిధులు మంజూరు చేయగా ఇప్పటివరకు ఆ పనులు పూర్తి చేయలేదని అన్నారు. ఇప్పటివరకు పనులను చేయకపోవడంతో రైతన్నల పక్షాన కాంగ్రెస్ పార్టీ, కడియం శ్రీహరికి పిండాలు పెట్టినట్లు తెలిపారు. వచ్చే యాసంగి వరకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వంగాలపల్లి, ధర్మపురం, మల్లక్‌పల్లి, వెంకటాపూర్ గ్రామాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల ఇన్‌చార్జ్ కర్ర సోమిరెడ్డి లాల్, మహ్మద్, మునిగాల రాజు, నాయకులు పాల్గొన్నారు.