
నగరాన్ని తలపించేలా పరకాల
పరకాల: వరద ముంపునకు గురికాకుండా ప్రణాళికబద్ధంగా అంచెల వారీగా నగరాన్ని తలపించేలా పరకాల పట్టణాన్ని సుందరీకరించనున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. గత పాలకుల స్వార్థపూరిత ప్రయోజనాలు, నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధిలో పరకాల పట్టణం వెనకబడిపోయిందని ఆరోపించారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 14, 19వార్డులలో జరుగుతున్న డ్రైనేజీల నిర్మాణపు పనులను శనివారం ఎమ్మెల్యే రేవూరి పరిశీలించారు. అధికారుల పర్యవేక్షణలో నాణ్యతతో కూడిన పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సుమారు రూ.24 కోట్లతో పరకాల పట్టణ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశామని, అభివృద్ధి పనుల్లో పట్టణ ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు కలగవచ్చని, కానీ భవిష్యత్‌తరాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అమృత్ పథకం కింద మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిన్న వర్షాలకే వరద ముంపునకు గురవుతున్న పరకాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలతో నివేదిక రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మా, ఏఈ రంజిత్, శ్రీకుంకుమేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్‌రావు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, మడికొండ సంపత్, రాంమూర్తి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల తనిఖీ
పరకాలలోని 14వవార్డులో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న బోధన, పుస్తకాల పంపిణీని అడిగి తెలుసుకున్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి