
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
ఖిలా వరంగల్: శస్త్ర చికిత్సలు చేయకుండా సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సాంబశివరావు వైద్యాధికారులకు సూచించారు. నగరంలోని రంగశాయిపేట పీహెచ్‌సీని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని రికార్డులను పరిశీలించి వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని మాతా శిశు సంరక్షణ, ప్రభుత్వ హాస్పిటల్‌లో డెలవరీలు, వ్యాధి నిరోధక టీకాలు అందించాలన్నారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయించి తగు చికిత్సలు అందించాలని కోరారు. కేన్సర్, పాలియాటివ్ కేర్ సర్వేలో గుర్తించిన వారికి సేవలు అందించాలన్నారు. వర్షాకాలంలో సాధారణంగా అంటు వ్యాధులు మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికెన్ గున్యా, మెదడువాపు, తీవ్రమైన నీళ్ల విరేచనాలు, ఒంక విరేచనాలు, జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, దీని నివారణకు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించి శుభ్రమైన నీటిని, అహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి తగు పరీక్షలు, చికిత్సలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొమురయ్య, పీహెచ్‌సీ వైద్యాధికారి రమ్య, సీసీ నాగరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ సాంబశివరావు