
ఆశలపల్లకిలో..
సాక్షి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని సర్కార్ ప్రకటించడంతో జిల్లాలో బీసీలకు జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులతోపాటు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు పెరగనున్నాయి. దీంతో ఆశావహుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. న్యాయపరమైన చిక్కులను అధిగమించి మరీ బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉండడంతో బీసీల నుంచి పోటీచేసే ఆశావహుల ఆశలకు రెక్కలు తొడిగినట్లైంది. గత స్థానిక ఎన్నికల్లో అనుసరించిన రిజర్వేషన్ మారే అవకాశం ఉండడంతో అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు, ఆశావహులు ఇప్పటినుంచే తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేసేపనిలో పడ్డారు. జిల్లాలోని 11 మండలాల్లో 317 గ్రామాలు 2,754 వార్డులు ఉన్నాయి. అంటే 11 జెడ్పీటీసీ స్థానాలు, 317 సర్పంచ్ పదవులతో పాటు 2,754 మంది వార్డు మెంబర్లు. అంటే జెడ్పీటీసీలో నాలుగు స్థానాలు, 120 నుంచి 130 మధ్య సర్పంచ్, 1,200లకుపైగా వార్డు సభ్యులుగా బీసీలకు అవకాశముందని అంచనా వేస్తున్న ఆ సామాజికవర్గ రాజకీయ నేతలు ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా మండలాలు, గ్రామాల్లో పట్టున్న బీసీ నాయకులు ఎలాగైనా ఆయా పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకొని తమ ఉనికి చాటాలనుకుంటున్నారు. ఇలా స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అంశం బీసీల్లో చాలామంది రాజకీయ నేతలకు భవిష్యత్ ఇస్తుందనే భరోసాతో ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు.
ఏర్పాట్లలో
అధికారులు బిజీ..
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గతంలోనే అధికారులు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికల సిబ్బంది నియామకం కూడా పూర్తయింది. మరోవైపు గ్రామాలు, మండలాల్లో రాజకీయ పార్టీల మధ్య ఎక్కడా ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు నిఘా ఉంచారు. ఎన్నికల షెడ్యూల్ ఏ సమయంలో వచ్చినా పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే జిల్లాలోని 317 పంచాయతీల్లో ఓటర్ల వివరాలు సేకరించారు. అలాగే బూత్‌ల వారీగా ఓటర్ల విభజనకు శ్రీకారం చుట్టారు.
ఒకేరోజు ఎన్నికలు.. లెక్కింపు
సాధారణ ఎన్నికలకు విభిన్నంగా పంచాయతీ ఎన్నికలు మధ్యాహ్నం వరకు ఓటింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు ఒకే రోజు ఉంటుంది. అందుకే బూత్‌లలో ఓటర్లు తక్కువ ఉండేలా అధికారులు విభజన చేస్తున్నారు. పంచాయతీలోని ఓటర్లను లెక్కించి బూత్‌ల వారీగా విభజిస్తున్నారు.
11మండలాల్లోనే
ఎన్నికలు
జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉన్నప్పటికీ వరంగల్, ఖిలావరంగల్ మండలాలు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. దీంతో ఆ రెండు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. మిగిలిన 11 మండలాలు, ఆయా గ్రామాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిందుకు ప్రభుత్వం యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
బీసీ రిజర్వేషన్ కోటా పెంపుపై పలువురి ఆసక్తి
ఎన్నికల్లో అవకాశాలు పెరగనుండడంపై హర్షం
స్థానిక పోరులో రెట్టింపుకానున్న ఆశావహుల సంఖ్య
మరోవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్న జిల్లా అధికారులు