
అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలి
హన్మకొండ: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన నిరుపేదలను ఎంపిక చేసే విషయంలో పారదర్శకత పాటించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతం అన్నారు. బుధవారం హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల డేటా వెరిఫికేషన్ క్షేత్ర స్థాయిలో నిబంధనల ప్రకారం సరిచూశాకే నియోజకవర్గ నోడల్ అధికారి ద్వారా జాబితాను కలెక్టర్ లాగిన్‌కు పంపాలన్నారు. పైలట్ గ్రామాల్లో ఇప్పటి వరకు ఇండ్లు ప్రారంభం కాని వారి స్థానంలో ఇతర గ్రామానికి చెందిన వారిని ఎంపిక చేస్తామన్నారు. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించిన ఏఈలు ప్రస్తుతం గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, ఆ తర్వాత నగరంలో చేపట్టే నిర్మాణాలను పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. అంతకు ముందు గ్రేటర్ వరంగల్ పరిధిలోని సోమిడి, వడ్డేపల్లి, దేశాయిపేట ప్రాంతాల్లో వెరిఫికేషన్ అధికారులు నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎండీ గౌతమ్, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడేతో కలసి పరిశీలించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్, జిల్లా నోడల్ అధికారులు రామిరెడ్డి, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం