
లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి
కమలాపూర్: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. కమలాపూర్, గూడూరు, అంబాల, శ్రీరాములపల్లి, గూనిపర్తి, మాదన్నపేట, శనిగరం, గోపాల్‌పూర్, నేరెళ్ల గ్రామాల్లో మంగళవారం ఆయ న పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో లేవని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ఇంటి స్థలం ఉన్న అర్హులైన పేదలందరికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలు సీఎం కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ తడక రాణిశ్రీకాంత్, జెడ్పీటీసీ సభ్యుడు లాండిగె లక్ష్మణ్‌రావు, సర్పంచ్ కట్కూరి విజయతిరుపతిరెడ్డి, ఎంపీటీసీ మాట్ల వెంకటేశ్వర్లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి