క్యాన్సర్‌.. కలకలం | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌.. కలకలం

May 27 2026 10:32 AM | Updated on May 27 2026 10:32 AM

జిల్లాలో 404 కేసులు నమోదు

బాధితుల్లో అత్యధికులు మహిళలే..

ఆహారపు అలవాట్లే ప్రధాన సమస్య

అంటున్న నిపుణులు

జిల్లా ఆస్పత్రిలో డే కేర్‌ కీమో థెరపీ సేవలు

జిల్లాలో నమోదతువున్న కేసులు..

బ్రెస్ట్‌, మౌత్‌, సర్వికల్‌, కొలన్‌,

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌

లక్షణాలు..

గుట్కా, కై నీ, మద్యం, పొగాకు సేవించడం, నిద్రిలేమి, పాకెట్‌ ఫుడ్స్‌, ఎక్కువగా వాడిన నూనె, ఆకుకూరగాయలపై పురుగు మందుల ప్రభావం, అసాధారణ నొప్పులు, రక్తస్రావం, దీర్ఘకాలిక ఆయసం, దగ్గు, ఆకస్మికంగా బరువు తగ్గడంలాంటివి క్యాన్సర్‌ లక్షణాలుగా చెప్పవచ్చు. స్క్రీనింగ్‌ తర్వాతే నిర్ధారణ అవుతుంది.

స్థానిక డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో అందించే సేవలు

కీమో థెరపీ, ఇమ్యూనో థెరపీ/టార్గెటెడ్‌ థెరపీ, రక్త మార్పిడి, ఇంజెక్షన్లు, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, నిర్ధారణ పరీక్షలు, బయాప్సీ, చిన్న శస్త్రచికిత్సలు, నొప్పి నివారణ, పల్లియేటివ్‌ కేర్‌, పోషకాహార సలహాలు, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్‌ సేవలు, చికిత్స తర్వాత పరిశీలన, ఫాలోఅప్‌, అత్యవసర వైద్య సాయం

వనపర్తి: జిల్లాలో ఏటా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి, వ్యాధి సమాచార, పరిశోధన కేంద్రాలిచ్చే నివేదికలతో వైద్య, ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని చిన్న జిల్లాల్లో ఒకటైన వనపర్తిలో ప్రస్తుతం 404 వివిధ రకాల క్యాన్సర్‌ కేసులు నమోదు కావడం శోచనీయం. వీరిలో కొందరికి స్థానిక జీజీహెచ్‌లో డే కేర్‌ కీమో థెరపీ సేవలు అందిస్తుండగా.. మరికొందరు అందుబాటులోని ప్రైవేట్‌ క్యాన్సర్‌ ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు వెచ్చించి వైద్యం తీసు‘కొంటున్నారు’.

మహిళలే అధికం..

జిల్లాలో నమోదైన క్యాన్సర్‌ కేసుల్లో 80 శాతం మహిళలే ఉండటం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 404 కేసులు నమోదు కాగా.. వారిలో 322 మహిళలు, 82 మంది పురుషులు ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించిన లెక్కలతో స్పష్టమవుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ మహిళలే అధికంగా క్యాన్సర్‌ బారిన పడుతున్నారని.. నివారణ కోసం భారత ప్రభుత్వం ఇటీవల 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌ పెళ్లి తర్వాత వేసుకుంటే అంతగా పని చేయదని నిపుణులు చెబుతున్నారు. అందుకే వైద్యశాఖ అధికారులు పాఠశాల స్థాయిలోనే బాలికలకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమా..?

మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, ఎక్కువగా ఎసిడిక్‌ ఆహార పదార్థాలను తీసుకోవడంతోనే క్యాన్సర్‌ కణాలు పుట్టుకొస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల్లో ఎక్కువగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వస్తుందని, వాటితోనే ఎక్కువగా ప్రాణనష్టం కలుగుతునట్లు అధికారిక లెక్కలు సైతం వెల్లడిస్తున్నాయి.

ప్రాథమిక దశలో గుర్తిస్తే మేలు..

క్యాన్సర్‌ వ్యాధిని ప్రాథమిక దశ అంటే స్టేజ్‌–1, స్టేజ్‌–2, స్టేజ్‌–3లో గుర్తించి సరైన వైద్యం తీసుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చు. ఆలస్యంగా గుర్తించడంతో సమస్య జఠిలం కావచ్చు. ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

– డా. దయాకర్‌రావు, సర్జరీ అంకాలజీస్ట్‌, యశోద ఆస్పత్రి

రోగులకు సేవలు అందిస్తున్నాం..

రోగి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఇంటి దగ్గర ఉంటూనే ఉదయం ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకొని వెళ్లవచ్చు. జీజీహెచ్‌తో పాటు వైద్య కళాశాలలోనూ కీమో థెరపీ, పాలియోటివ్‌ కేర్‌ సేవలు అందిస్తున్నాం. గ్రామీణప్రాంత పేద రోగులకు డేకేర్‌ సెంటర్‌ ప్రయోజనకర సేవలు అందిస్తోంది. – రాంచందర్‌రావు, పీఓ, క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్‌, వనపర్తి

గోపాల్‌పేటలో 76 కేసులు..

జిల్లాలో అత్యధికంగా గోపాల్‌పేట పీహెచ్‌సీ పరిధిలో 76 కేసులు, రెండోస్థానంలో పెద్దమందడి పీహెచ్‌సీ పరిధిలో 39 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కమాలోద్దీన్‌పూర్‌ పీహెచ్‌సీ పరిఽధిలో 5 కేసులు నమోదయ్యాయి. ఎన్‌సీడీసీ ప్రోగ్రాం టెస్టులతో క్యాన్సర్‌ లక్షణాలున్న వారిని బయాప్సీ టెస్టులకు సిఫారస్‌ చేసి రోగులను గుర్తించి డే కేర్‌ సెంటర్‌లో వైద్యసేవలందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement