ఖిల్లాఘనపురం: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని ఉప్పరిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఉమామహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉదయం వేళ విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఉపాధ్యాయులు ఐక్యంగా ఉంటూ విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, నాటికలు, పాటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను చిన్నారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జయశంకర్, మాజీ డిప్యూటీ డీఈఓ విశ్వనాథం, సర్పంచ్ బాలరాజు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, మహిళలు పాల్గొన్నారు.


