రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
వనపర్తి టౌన్: రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని రవాణశాఖ అధికారులు సైదులు, శ్రీకాంత్ కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించగా వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. వాహనాలు నడిపే సమయంలో చేసే తప్పిదంతో మన జీవితమే కాకుండా ఎదుటి వారి జీవితం, కుటుంబం రోడ్డున పడుతుందని.. అలసత్వం వీడి బాథ్యతగా నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు విధిగా సీట్‌బెల్ట్ ధరించాలన్నారు. యువత వేగంగా వాహనాలు నడిపే సమయంలో అమ్మ, నాన్నను గుర్తు చేసుకోవాలని, మన కొరకు ఎదురు చూస్తుంటారనే విషయాన్ని మరిచి పోవద్దని వివరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, త్రిపుల్ రైడింగ్ చట్టరీత్యా నేరమని తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎం ఉమాదేవి, సీఎంఓ ప్రతాపరెడ్డి, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


