రెండోవిడత సజావుగా సాగేలా చూడాలి
వనపర్తి: రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఆదివారం రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే 5 మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించి మాట్లాడారు. పోలింగ్ సిబ్బంది గందరగోళానికి గురికాకుండా అధికంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక గ్రామపంచాయతీలో ఎన్ని పోలింగ్ కేంద్రాలుంటే కౌంటర్‌లో అన్ని టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా పంపిణీ సులభం అవుతుందని తెలిపారు. పోలింగ్ సిబ్బంది సామగ్రి తీసుకొని తమ కేంద్రాలకు చేరుకునే వరకు రిజర్వ్ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు చేపట్టే సమయంలో అభ్యర్థి లేదా ఏజెంట్‌ను మాత్రమే అనుమతించాలని చెప్పారు. మొబైల్ ఫోన్‌కు అనుమతి లేదని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బందోబస్తుతో పాటు వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలింగ్ సమయంలో ఉదయం 9, 11, మధ్యాహ్నం ఒంటిగంట వరకు పక్కాగా ఓటింగ్ రిపోర్టులు పంపించేలా ఆపరేటర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పెద్ద గ్రామపంచాయతీల్లో కౌంటింగ్ కోసం ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.


