విపత్తులు సమర్థవంతంగా ఎదుర్కోవాలి
వనపర్తి: అకస్మాత్తుగా వచ్చే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఇచ్చే శిక్షణ, సూచనలు, సలహాలు అమలు చేస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. ఆయనతో పాటు జిల్లా లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. విపత్తులను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యవస్థ ఉండాలి, ముందస్తు ఏర్పాట్లు, బాధ్యతలు ఎలా ఉండాలి అనే విషయాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రిటైర్డ్ మేజర్ జనరల్ సుధీర్‌బాల్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, పోలీస్, అగ్నిమాపక అధికారులతో ఈ నెల 17 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహించి మాక్ వ్యాయామం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో అధికారుల బాధ్యత, నిర్వర్తించాల్సిన పనులపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ మధ్యకాలంలో తరచూ భారీ వర్షాలు, వరదలు, భూకంపాలు, సునామీలు వస్తున్నాయని.. ఆకస్మికంగా వచ్చినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందన్నారు. ఇందుకు మౌలిక సౌకర్యాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం, అధికారులకు వారి బాధ్యతలపై స్పష్టమైన అవగాహన ఉండటం చాలా అవసరమని తెలిపారు. అందుకే సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాక్‌డ్రిల్ నిర్వహించాలనుకున్నట్లు తెలియజేశారు.


