వ్యయ వివరాల నమోదు తప్పనిసరి
కొత్తకోట రూరల్/గోపాల్‌పేట: గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎం.శ్రీనివాసులు కోరారు. శుక్రవారం పెద్దమందడి ఎంపీడీఓ కార్యాలయం, గోపాల్‌పేట ఎంపీడీఓ కార్యాలయంలో మొదటివిడత అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రిజిస్టర్లను ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల వ్యయ పరిమితి, చేసిన ఖర్చు వివరాలు ఏ విధంగా రిజిస్టర్‌లో నమోదు చేయాలనే విషయాలపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు ఎవరెవరు దేనికోసం ఎంత ఖర్చు చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి అభ్యర్థికి సంబంధించిన ఖర్చును మూడుసార్లు పరిశీలిస్తామని.. షెడ్యూల్ ప్రకారం అందరు అభ్యర్థులు ఖర్చు వివరాలు, బిల్లులు, ఓచర్లతో హాజరుకావాలని సూచించారు. ఎన్నికల వ్యయం చూపించని అభ్యర్థులపై ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


