ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు
వనపర్తి రూరల్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని చిమనగుంటపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు ప్రక్రియ, ధాన్యం నాణ్యత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ప్రతి రోజు కచ్చితంగా రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఆన్‌లైన్ ట్యాబ్‌ఎంట్రీలు తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. కేంద్రంలో ధాన్యం నిల్వ ఉండకుండా తూకం వేసిన వెంటనే కేటాయించిన రైస్‌మిల్లుకు తరలించాలన్నారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించినా, రైతులకు ఇబ్బంది కలిగించినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


