దివ్యాంగులు క్రీడల్లోనూ రాణించాలి
వనపర్తి: వికలత్వం శరీరానికి కాని.. మనసుకు కాదని స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్దులశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆయనతోపాటు డీఆర్డీఓ ఉమాదేవి, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి పాల్గొని జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని.. వారికి కావాల్సిన శిక్షణ కూడా ఇప్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


