పారదర్శకంగా, పకడ్బందీగా పోలింగ్
● సామగ్రి పంపిణీ కేంద్రాలనుపరిశీలించిన కలెక్టర్
● పాన్‌గల్‌లో ఏర్పాట్లు సరిగాలేవని మండలస్థాయి అధికారులపై ఆగ్రహం
పాన్‌గల్/వీపనగండ్ల/వనపర్తి రూరల్: మూడోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం పాన్‌గల్, వీపనగండ్ల, పెబ్బేరులో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రజలు తమ ఓటు హక్కును తమకు నచ్చిన అభ్యర్థికి నిర్భయంగా వేసుకోవచ్చన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ సామగ్రి తీసుకున్న సిబ్బంది ఫారం–9 ప్రకారం బ్యాలెట్ పేపర్లు సరిచూసుకొని పీఓలకు అప్పగించాలన్నారు. సిబ్బందితో కలెక్టర్ మాట్లాడి వారి వద్ద ఉన్న బ్యాలెట్ పేపర్లలో సర్పంచ్, వార్డు సభ్యుల వారీగా పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు.
● పాన్‌గల్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో కౌంటర్ల ఏర్పాట్లపై ఎంపీడీఓ గోవిందరావు, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూట్లవారీగా సిబ్బందిని కూర్చోబెట్టాల్సింది పోయి ఒకే దగ్గర గుంపులు, గుంపులుగా కూర్చోబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా అధికారులు సూచించిన విధంగా కాకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. సామగ్రి పంపిణీ, తరలింపులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. వీపనగండ్ల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన సమయంలో కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసరావు ఉన్నారు.


