చివరి విడతకు పటిష్ట భద్రత : ఎస్పీ
వనపర్తి: జిల్లాలో మూడోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిర్భయంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసుశాఖ పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మూడోవిడత ఎన్నికలు జరిగే పెబ్బేరు, పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి, శ్రీరంగాపురం మండలాల్లో 87 గ్రామపంచాయతీలు ఉండగా.. 6 ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన పంచాయతీల్లో 1,300 మంది అధికారులు, సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు వివరించారు. పోలింగ్, కౌంటింగ్, ఫలితాల వెల్లడి వరకు విధుల్లో ఉన్న సిబ్బంది సమయస్ఫూర్తి, అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి నిమిషం పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బీఎన్‌ఎస్ 163 చట్టం అమలులో ఉంటుందని, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలు, మొబైల్ పెట్రోలింగ్, చెక్‌పోస్టులు నిరంతరం పని చేస్తాయని వివరించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, డీజేలు, బాణసంచాకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.
గ్రామీణ ఆవిష్కరణలకు ప్రోత్సాహం : కలెక్టర్
వనపర్తి: గ్రామీణ ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారం గుర్తించడమే ‘ఇన్నోవేషన్ పంచాయతీ’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇన్నోవేషన్ పంచాయతీ’ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామీణస్థాయి ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్‌లోని ఐటీ టవర్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా స్టార్టప్స్, ఇన్నోవేటర్లు, యువ ఔత్సాహికులకు వినూత్న ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆవిష్కరణలకు ఆన్ ది స్పాట్ వాలిడేషన్, మెంటర్‌షిప్, టెక్నికల్ సపోర్ట్ అందిస్తారన్నారు. రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టంను బలోపేతం చేయడం, యువతలో ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. మరిన్ని వివరాలకు pr&tsic@telangana.gov.in సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో టీజీఐసీ ప్రోగ్రాం లీడ్ రమేష్‌గౌడ్, ఐడీసీ మేనేజర్ శ్రీకాంత్, ఈడీఎం వెంకటేష్, డీఎస్‌ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
గోపాల్‌పేట: మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థి ని స్వరూప ఎస్జీఎఫ్ అండర్–17 జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై ందని పాఠశాల పీడీ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగే ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. నవంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్‌కీపర్‌గా అత్యంత ప్రతిభ కనబర్చినందుకుగాను ఎంపిక చేసినట్లు వివరించారు. గతంలో ఎస్జీఎఫ్ క్రీడల్లో మూడుసార్లు పాల్గొని ప్రతిభ కనబర్చిందని, కల్వకుర్తిలో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి టోర్నీ, మధ్యప్రదేశ్‌లో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్‌కీపర్‌గా అవార్డు సాధించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.
చివరి విడతకు పటిష్ట భద్రత : ఎస్పీ


