హస్తగతం..
ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు
పెబ్బేరు మండలం వై.శాఖాపురంలో
విజయోత్సవ ఊరేగింపు
జిల్లాల వారీగా పోలింగ్, ఫలితాలు ఇలా..
మహబూబ్‌నగర్: జిల్లాలో మూడో విడతలో 133 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్.. జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్, జడ్చర్ల మండలాల పరిధిలో నిర్వహించిన ఎన్నికల్లో 67 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. 52 జీపీల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. బీజేపీకి చెందిన నలుగురు, తొమ్మిది చోట్ల ఇతరులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
నాగర్‌కర్నూల్: జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, పదర, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లోని 158 జీపీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 102 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. 37 చోట్ల బీఆర్‌ఎస్‌కు చెందిన వారు గెలుపొందారు. ఇతరులు 12, బీజేపీకి చెందిన ఒకరు సర్పంచ్‌గా విజయం సాధించారు.
నారాయణపేట: జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, మక్తల్, మాగనూర్, కృష్ణ, ఊట్కూరు మండలాల్లో 110 జీపీలకు పోలింగ్ నిర్వహించారు. 59 గ్రామాల్లో హస్తం.. 25 చోట్ల బీఆర్‌ఎస్, 17 జీపీల్లో బీజేపీకి చెందిన వారు గెలుపొందారు. తొమ్మిది గ్రామాల్లో ఇతరులు సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు.
వనపర్తి: జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి, పానగల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల్లో 87 జీపీలకు ఎన్నికలు జరిగాయి. 46 పంచాయతీల్లో హస్తం, 26 జీపీల్లో బీఆర్‌ఎస్, మూడు చోట్ల బీజేపీ మద్దతుదారులు, 12 మంది స్వతంత్రులు సర్పంచ్‌లుగా విజయబావుటా ఎగురవేశారు.
జోగుళాంబ గద్వాల: జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి, మానవపాడు, అలంపూర్, ఎర్రవెల్లి, ఇటిక్యాల మండలాల్లో మొత్తం 75 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 25 జీపీల్లో కాంగ్రెస్, 31 పంచాయతీల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు, 19 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు.
అక్కడక్కడ..
● వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కాళ్లూరు గ్రామంలో ఆరో వార్డులో ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో ఫలితాలు తారుమారు చేస్తున్నారని రోడ్డుపై బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. పోలీస్‌లు అక్కడకు చేరుకుని వారిని సముదాయించారు. చివరకు బీఆర్‌ఎస్ మద్దతుదారు గెలవడంతో వారు ఆందోళనను విరమించారు.
● నారాయణపేట జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ మద్దతుదారు మెట్ల తిరుపతమ్మ గెలుపొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బ్రహ్మం అనే వ్యక్తిపై ‘కారు’ కార్యకర్తలు దాడికి పాల్పడగా.. అక్కడున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
తుది విడత: 504 సర్పంచ్, 4,016 వార్డుల్లో పోలింగ్
ఉమ్మడి జిల్లాల్లో 27 మండలాల పరిధిలో తుది విడత ఎన్నికలు జరిగాయి. 563 జీపీల్లో ఏడు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 52 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 504 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించారు. 5,016 వార్డు స్థానాలకు గాను 58 వార్డుల్లో నామినేషన్లు పడలేదు. 942 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 4,016 వార్డుల్లో పోలింగ్ జరిగింది. పలు చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులను విజయం వరించగా.. రీకౌంటింగ్‌లతో ఉత్కంఠ నెలకొంది. కొన్ని గ్రామ పంచాయతీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
తుది విడతలోనూ కాంగ్రెస్‌కే ఆధిక్యం
సత్తా చాటిన బీఆర్‌ఎస్ మద్దతుదారులు
ప్రభావం చూపలేక వాడిపోయిన ‘కమలం’
ఉమ్మడి జిల్లాలో సర్పంచ్‌లకు సన్మానాల పర్వం షురూ
‘హస్తం’ శ్రేణుల్లో జోష్.. ‘కారు’ కార్యకర్తల్లోనూ ఉత్సాహం
హస్తగతం..


