పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి/వనపర్తి రూరల్: జిల్లావ్యాప్తంగా ఉన్న 15 మండలాల పరిధిలోని 268 గ్రామపంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామని కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. బుధవారం మూడోవిడత ఎన్నికల ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌లో జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు మల్లయ్యబట్టు, వ్యయ పరిశీలకుడు శ్రీనివాసులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి పరిశీలించారు. ఉదయం శ్రీరంగాపురం మండలం వెంకటాపూర్‌లో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రం, శ్రీరంగాపూర్ మండల కేంద్రం, పెబ్బేరు మండలం కంచిరావుపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు, భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకే ఓటువేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మూడోవిడతలో ఎన్నికలు జరిగిన ఐదు మండలాల పరిధిలో మొత్తం 1,11,357 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.


