ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి నామినేషన్ల స్వీకరణ, మూడు విడతల్లో ఎన్నికలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయని.. ఎన్నికల విధులు నిర్వర్తించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ సునీతరెడ్డి అభినందనలు తెలిపారు. చివరి విడత ఎన్నికల సందర్భంగా ఆమె శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడంలో యంత్రాంగం పాత్ర విశేషమన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు, రాత్రి గస్తీ, ముందస్తు చర్యలు, నిరంతర నిఘా వంటి చర్యలతో ఏ చిన్న ఘర్షణ కూడా పెద్ద సమస్యగా మారకుండా నియంత్రించగలిగామని తెలిపారు. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి పోలింగ్ కేంద్రంలో బందోబస్తును పరిశీలించిన ఓటర్లతో మాట్లాడారు.


