ఆధునిక పరిజ్ఞానంతో కుంకుమపువ్వు సాగు
కొత్తకోట రూరల్: చదువుకున్న గ్రామీణ యువత, ఆసక్తి ఉన్న యువ రైతులు ఆధునిక పరిజ్ఞానం, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో కుంకుమపువ్వు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని నాబార్డు మహబూబ్‌నగర్ క్లస్టర్ డీడీఎం పి.మనోహర్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని మోజర్ల ఉద్యాన కళాశాలలో నాబార్డ్ ఆర్థిక సాయంతో ఏరోఫోనిక్స్ పద్ధతిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కుంకుమపువ్వు సాగుపై నిర్వహించిన ఒకరోజు శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కుంకుమపువ్వు ప్రాజెక్టు ప్రధాన పరిశోధకుడు ప్రొ. పిడిగం సైదయ్య మాట్లాడుతూ... కశ్మీర్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి కుంకుమ పువ్వును ఎలా పెంచాలో విద్యార్థులు, రైతులకు వివరించినట్లు తెలిపారు. ఏరోఫోనిక్స్ పద్ధతిలో దిగుబడి, నాణ్యత పెంచేందుకు మరిన్ని పరిశోధనలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న వారికి శిక్షణ, సాగులో మెళకువలు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మేలైన పద్ధతులు, ఖర్చు తగ్గించే పద్ధతితో పాటు తెలంగాణ ప్రాంతంలో సాగు చేసేందుకు అవసరమైన మెళకువలను ప్రొ. సైదయ్య వివరించారు. అసోసియేట్ ప్రొఫెసర్ డా. షహనాజ్ కుంకుమపువ్వు పరికరాల పనితీరు గురించి అవగాహన కల్పించారు. 50 మంది విద్యార్థులు శిక్షణకు హాజరయ్యారు.


