ఉత్సాహంగా అస్మిత లీగ్ అథ్లెటిక్స్
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా మైదానంలో శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ), అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) సంయుక్తంగా అస్మిత లీగ్ అథ్లెటిక్స్ జిల్లా మీట్ 2025–26 నిర్వహించినట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం చైర్మన్ వాకిటి శ్రీధర్, కార్యదర్శి నందిమళ్ల శ్రీకాంత్ తెలిపారు. క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, కాంగ్రెస్ నాయకుడు లక్కాకుల సతీష్ హాజరయ్యారని చెప్పారు. సాయంత్రం ముగింపు సమావేశానికి లక్కాకుల సతీష్ పాల్గొని విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసినట్లు వివరించారు. దేశంలోని 26 రాష్ట్రాల్లో పోటీలు కొనసాగుతున్నాయని.. గ్రామాల్లోని బాలికల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి భావిభారత అథ్లెట్లుగా తీర్చిదిద్దడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సెపక్‌తక్రా అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి భాస్కర్‌గౌడ్, బోలమోని నర్సింహ, శంకర్, అలి, శ్రీనివాస్‌రెడ్డి, పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు.


