‘విద్యను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు’
వనపర్తిటౌన్: పాలకులు ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్, గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ జేడీ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని యాదవ భవనంలో పీడీఎస్‌యూ 4వ జిల్లా మహాసభలు సంఘం జిల్లా అధ్యక్షుడు దినేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పాలకుల అసమర్థతతో ధనికుల పిల్లలకు ఒక విద్య, పేదల బిడ్డలకు ఒక విద్య అందుతోందని, ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే పార్టీలను విద్యార్థులు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి 50 ఏళ్లుగా పీడీఎస్‌యూ కృషి చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాక ముందు విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. నేడు గాలికొదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 29 డీఈఓ, 530కి పైగా ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ లోపించి నిర్వాహణ గాఢి తప్పుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దినేష్, ప్రధాన కార్యదర్శిగా గణేశ్, కోశాధికారిగా గోవర్ధన్‌తో పాటు 11 మంది సభ్యులు ఎన్నికయ్యారు. కార్యక్రమ ప్రారంభంలో సంఘం జెండాను ఎగురవేశారు. సమావేశంలో సంఘం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్‌కుమార్, టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి కొంకల వెంకట నారాయణ, అరుణ్, గోవర్ధన్, కృష్ణవేణి, విశ్వతేజ, చరణ్, మనోహర్, రవి తదితరులు పాల్గొన్నారు.


