బకాయి వేతనాలు చెల్లించాలని ఆందోళన
ఆత్మకూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ కోరారు. మంగళవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ ఎదుట కార్మికులు నిర్వహించిన సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక ఆస్పత్రిని 30 పడకల నుంచి 23 పడకలకు కుదించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కార్మికులు ఏళ్లుగా కనీస వేతనాలకు నోచుకోక వెట్టిచాకిరి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే వేతనం రూ.11 వేలుకాగా.. అందులో రూ.1,500 కోత విధిస్తున్నారని, వెంటనే ఏజెన్సీని రద్దు చేయాలని, జీఓ ప్రకారం రూ.12,093 వేతనం ఇవ్వాలని కోరారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని వైద్యాధికారి హరినారాయణరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, నాయకులు సత్తార్, బాలరాజు, శ్రీకాంత్, అరుణ్, శైలజ, బాలకిష్టమ్మ, నాగమ్మ, పార్వతమ్మ, మైనుద్దీన్, తిరుపతమ్మ, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.


