చెరుకు కోతలు షురూ
45 కోత బృందాలు, 12 యంత్రాల సాయంతో..
● కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలోప్రారంభమైన క్రషింగ్
● టన్నుకు రూ.3,924 మద్దతు ధర
● ఫ్యాక్టరీ పరిధిలో 7,800 ఎకరాలు
● టన్ను పంట కోతకు రూ.610, డ్రైవర్ బత్తా రూ.300, ఎద్దుల బండి అద్దె రూ.150 రైతులే చెల్లించాలని ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయించింది. రైతులు ఈ ధరలు మాత్రమే కోత కార్మికులకు ఇవ్వాలని తెలియజేస్తూ పంట కోతలు చేపడుతున్నారు.
●
మూడు నెలల పాటు ఉపాధి..
ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు కోతలు చేపట్టేందుకు ఏటా వస్తుంటాం. రోజు రూ.500 నుంచి రూ.600 సంపాదిస్తాం. మూడు నెలల పాటు భార్యాపిల్లలతో ఇక్కడే ఉండి కోతలు పూర్తి చేస్తాం. కుటుంబ పోషణకు పంట కోతలున్న ప్రాంతాలకు వలస వెళ్తుంటాం. – యోగేశ్వర్,
కోత కార్మికుడు, ఎర్రగొండపాలెం
గ్రామాల వారీ కోతలు చేపట్టాలి..
కోత కార్మికులను సకాలంలో రప్పించి గ్రామాల వారీగా కోత పనులు పూర్తి చేయాలి. తక్కువ సాగుచేసిన రైతుకు ఒక న్యాయం.. అధికంగా సాగు చేసిన రైతుకు మరో న్యాయం అన్నట్టుగా ఫ్యాక్టరీ సిబ్బంది తేడా చూపకుండా కోత పనులు చేపట్టాలి.
– నారాయణ, రైతు, సింగంపేట, అమరచింత
రూ.6 వేలు మద్దతు ధర ఇవ్వాలి..
కేంద్ర ప్రభుత్వం పత్తికి ఇస్తున్న మద్దతు ధర ప్రకారం టన్ను చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర చెల్లించాలి. ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.3,924 ధర చెల్లిస్తోంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఒకేసారి 150 కోత కార్మికుల బృందాలను రప్పించాలి.
– రాజన్న, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు,
కృష్ణవేణి చెరుకు రైతు సంఘం
సకాలంలో పూర్తి..
సకాలంలో చెరుకు కోతలు పూర్తి చేయడానికి యాజమాన్యం తగిన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఫ్యాక్టరీలో సోమవారం నుంచి క్రషింగ్ ప్రారంభమైంది. ఇందుకు కావాల్సిన ముడి చెరుకును సకాలంలో ఫ్యాక్టరీకి తరలించేందుకుగాను 45 కోత కార్మిక బృందాలతో పాటు 12 యాంత్రాలను సిద్ధంగా ఉంచాం. పంట ఫ్యాక్టరీకి చేరిన 15 రోజుల్లో రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. రైతులు ఈ విషయాన్ని గమనించాలి. – నాగార్జునరావు,
డీజీఎం, కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ
అమరచింత: రైతులకు సకాలంలో డబ్బులు చెల్లిస్తుండటం, రాయితీలను కొనసాగిస్తుండటంతో ఈసారి కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరి పరిధిలో చెరుకు సాగు విస్తీర్ణం గతేడాది కంటే 3 వేల ఎకరాలు పెరిగింది. మద్దతు ధర రూ.3,924 చెల్లిస్తుండటంతో రైతులు చెరుకు సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అనుకున్న సమయానికి పంట కోతలు ప్రారంభించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం శ్రీకారం చుట్టినా.. వర్షాల కారణంగా పది రోజులు ఆలస్యంగా మొదలయ్యాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని ఎర్రగొండపాలెం నుంచి 30, తుని నుంచి 5, నల్గొండ నుంచి 10 కోత కార్మికుల బృందాలతో పాటు 12 కోత యంత్రాలను సిద్ధం చేసి రోజు వివిధ గ్రామాల్లో పంట కోతలు చేపట్టేలా యాజమాన్యం తగిన చర్యలు చేపట్టింది.
ఫ్యాక్టరీ పరిధిలో సాగు ఇలా..
కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 7,800 ఎకరాల్లో చెరుకు సాగైంది. ఐదేళ్ల కిందట 15 వేల ఎకరాల సాగు ఉండగా.. పంట విక్రయించిన రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం త్వరగా డబ్బులు చెల్లించకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. రెండేళ్లుగా సకాలంలో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం, రాయితీలను సైతం అందిస్తుండటంతో ఆరువేల నుంచి 7,800 ఎకరాలకు చేరింది. గతంలో జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, నారాయణపేట జిల్లా నర్వ మండలంలో 3,200 ఎకరాలు, గద్వాల జిల్లాలోని రాజోలి, అలంపూర్‌లో రెండు వేల ఎకరాల్లో చెరుకు సాగు ఉండగా.. రెండేళ్లలో సాగు విస్తీర్ణం మరింత పెరిగింది. అత్యధికంగా జిల్లాలోనే చెరుకు సాగవుతుండటంతో అమరచింత, ఆత్మకూర్ మండలాల పరిధిలో ముందుగా కోతలు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.
అధ్వాన రహదారులతో ఇబ్బందులు..
ఆత్మకూర్, అమరచింత మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో రహదారులు అధ్వానంగా ఉండటంతో పంటను ట్రాక్టర్లలో ఫ్యాక్టరీకి తరలించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీడీసీ నిధులతో రహదారి మరమ్మతులు చేపట్టాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యానికి విన్నవించినా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
చెరుకు కోతలు షురూ
చెరుకు కోతలు షురూ
చెరుకు కోతలు షురూ
చెరుకు కోతలు షురూ


