క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
వనపర్తి రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని.. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా అండర్ 14, 17, 19 క్రీడల ప్రారంభోత్సవానికి ఆయనతో పాటు ఆర్‌సీఓ శ్రీనివాస్‌గౌడ్, డీసీఓ శ్రీవేణి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ క్రీడా జ్యోతి వెలిగించి వాలీబాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ప్రతిభగల క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లాస్థాయిలో రాణించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాలని సూచించారు. ఆర్‌సీఓ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ గురుకుల పాఠశాలలో చదివే ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో చక్కటి ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఉమ్మడి జిల్లా బీసీ గురుకులాల విద్యార్థులు ఐదేళ్లుగా స్టేట్ మీట్‌లో పాల్గొని సత్తా చాటుతున్నట్లు గుర్తు చేశారు. క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని 14 ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాలలు, 4 కళాశాలల నుంచి 450 విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గురువయ్యగౌడ్, ప్రశాంతి, పాఠశాల చైర్మన్ రాజు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్


