వైద్యశాఖలో గందరగోళం
వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో గందరగోళం నెలకొంది. జిల్లా వైద్యాధికారి, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, అక్రమాల ఫిర్యాదులతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడం, అనారోగ్య కారణాలతో జీజీహెచ్ ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డా. రంగారావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో జీజీహెచ్‌లో పని చేస్తున్న సీనియర్ వైద్యుడికి సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించినా.. వ్యక్తిగత కారణాలతో ఆయన కూడా సెలవు పెట్టారు. ప్రస్తుతం విధుల్లో ఎవరు ఉన్నారనే విషయంపై గందరగోళం నెలకొంది. ఆర్‌ఎంఓలు అన్నింటికీ తామే అన్నట్లుగా పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీజీహెచ్‌లో ఏదైనా పనుల కోసం ఎవరిని సంప్రదించాలనే విషయంలో అధికారులు, పాలకులు అయోమయంలో ఉన్నట్లు సమాచారం.
జిల్లా వైద్యాధికారి విషయంలోనూ..
జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి డా. ఏ.శ్రీనివాసులుకు పదోన్నతి కల్పించి నారాయణపేట జిల్లాకు బదిలీ చేశారు. ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్‌కు ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ బాధ్యతలు అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ ఏ.శ్రీనివాసులు ఇక్కడి నుంచి రిలీవ్ కాకపోగా.. ముందస్తుగా కలెక్టర్‌తో తీసుకున్న అనుమతి మేరకు సెలవుపై వెళ్తూ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. శ్రీనివాసులుకు బాధ్యతలు అప్పగించారు. డా. సాయినాథ్ పేరుతో రాష్ట్రస్థాయి అధికారుల నుంచి ఆదేశాలొచ్చినా.. ఇక్కడ ఉన్న అధికారి రిలీవ్ కాకపోవడం, ఆయన సెలవు పూర్తి చేసుకుని వచ్చే వరకు డిప్యూటీ డీఎంహెచ్‌ఓకు ఇన్‌చార్జ్ ఇవ్వటంతో సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది విస్మయంలో పడ్డారు. పాలకులు, ఉన్నతాధికారులు చొరవచూపి నెలకొన్న అనిశ్చితిని పరిష్కరిస్తేనే వైద్యశాఖలో నెలకొన్న గందరగోళానికి తెరపడుతుందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు కీలక పోస్టుల్లో
ఎవరు ఉన్నారో తెలియని పరిస్థితి


