తొలి విద్యాశాఖ మంత్రికి ఘన నివాళి..
విద్యారంగానికి బలమైన పునాదులు వేసిన ఘనత దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కే దక్కుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలో ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య పాల్గొని కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆ మహనీయుడి జయంతి రోజునే జాతీయ విద్యా దినోత్సవం జరుపుకొంటున్నట్లు వివరించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడని.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పని చేశారని గుర్తుచేశారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ తరుణ్ చక్రవర్తి, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జల్, డీపీఆర్వో సీతారాం నాయక్, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


