రహదారి నిబంధనలు పాటించాలి
వనపర్తి: రహదారి నిబంధనలు తెలుసుకోవడమే కాకుండా కచ్చితంగా పాటిస్తూ వాహనాలు నడపాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ రావుల గిరిధర్ ప్రత్యేక చొరవతో పట్టణంలోని కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్, రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లైసెనన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాలు నడిపేటప్పుడు సీట్‌బెల్టు ధరించాలని సూచించారు. ట్రిబుల్ రైడింగ్, వాహనాన్ని అతివేగంగా నడపడం, యువత స్టంట్లతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోతున్నారని తెలియజేశారు. యూటర్న్, జీబ్రా క్రాసింగ్, డివైడర్ టర్న్ తదితర నిబంధనలపై యువత అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. రహదారి నిబంధనలు తెలియకపోవడం, తెలిసినా వాటిని పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏడాదికి 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు, భాగస్వామి మన రాకకోసం ఎదురుచూస్తుంటారని.. ఎదురుచూపు విషాదకరంగా మారొద్దని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు యువత ముందుకురావాలని, ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు తెలుసుకొని విధిగా పాటించాలని సూచించారు. యువత ట్రాఫిక్ నిబంధనలపై శిక్షణ పొందడమే కాకుండా తమ జూనియర్లు, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ కృష్ణయ్య, స్టేషన్ హౌజ్ అధికారులు, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


