పక్కాగా జల వనరుల గణన
వనపర్తి: జిల్లాలోని చిన్ననీటి వనరుల లెక్క పక్కాగా తేల్చేందుకు నిర్వహించనున్న గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్ననీటి పారుదల వనరుల గణన ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలన్నారు. రెండు వేల హెక్టార్లలోపు ఉన్న జలవనరుల గణన మొబైల్ అప్లికేషన్‌న ద్వారా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, నీటిపారుదలశాఖ ఏఈలు సూపర్‌వైజర్‌గా ఉంటారని, జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్‌అసిస్టెంట్లు, ఏఈవోలు ఎన్యూమరేటర్లుగా కొనసాగుతారని తెలిపారు. జిల్లాలో ఉన్న 228 రెవెన్యూ గ్రామాల్లో ఉన్న నీటి వనరుల గణన కోసం 67 మంది ఏఈఓలు, 102 మంది జీపీఓలు, అవసరానికి తగ్గట్టుగా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లను కేటాయించాలన్నారు. ఎన్యూమరేటర్లకు మండలాల స్థాయిలో త్వరతగతిన శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. నీటిపారుదల, విద్యుత్, ఇతర శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన వివరాలను గణన చేస్తున్న వారికి అందజేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఓ తరుణ్ చక్రవర్తి, సీపీఓ రవీందర్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రాజశేఖర్, నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.


