దళారుల దోపిడీ
వరి కొనుగోలు కేంద్రాల్లో తూకాలు చేయడంలో నిర్లక్ష్యం
●
అమరచింత: జిల్లాలో వరి కోతలు ప్రారంభించి 20 రోజులు దాటి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నా ప్రభుత్వం తూకాలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా వారు మద్దతు ధర కన్నా తక్కువ చెల్లిస్తూ రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. కానీ ప్రైవేట్ వ్యాపారులు ధాన్యం కాంటా చేసిన వెంటనే రైతుకు డబ్బులు చెల్లిస్తుండడంతో గ్రామాల్లో వారి దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఆయా మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారే తప్పా.. ప్రభుత్వం అందిస్తున్న గిట్టుబాటు ధర, బోనస్ చెల్లింపులపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 396 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినా.. ఇప్పటి వరకు కేవలం 178 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి 816 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో ధాన్యం కల్లాల్లోనే రోజుల తరబడి ఉండాల్సి రావడంతో వర్షాలు వస్తే చేతికందిన ధాన్యం పాడవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు తమ కమీషన్ ఏజెంట్లను గ్రామాలకు పంపుతూ వరి ధాన్యం తమ మిల్లులకే చేరే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రైతులకు హమాలీ ఖర్చులు మిగులుతుండడంతో తాము పండించిన వరిధాన్యం ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకుంటున్నారు.
మద్దతు ధర రూ.2,380
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయిస్తే క్వింటాల్‌కు రూ.2380 రైతులకు అందుతుంది. కానీ కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు రూ.2100 కే దళారులకు విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఇప్పటి వరకు సర్కార్ సేకరించిన ధాన్యం 816 క్వింటాళ్ల్లే
తప్పనిసరి పరిస్థితుల్లోప్రైవేట్‌కు మొగ్గు..
రూ.2,100 కే విక్రయించాల్సిన దుస్థితి
యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నాలకు అందని బోనస్


