మధుమేహం వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై శ్రద్ధ
వనపర్తి: జిల్లాలో వైద్యారోగ్య శాఖ ద్వారా గుర్తించిన మధుమేహం వ్యాధిగ్రస్తులందరికీ రెటినోస్కోపి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదర్శ్‌సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ప్రోగ్రాం ఆఫీసర్లతో రెటినోపతి వైద్య పరీక్షల కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 14 నుంచి ప్రారంభించి 100 రోజుల్లో జిల్లాలోని ప్రతి మధుమేహం వ్యక్తికి రెటినోపతి వైద్య పరీక్ష నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మధుమేహం వ్యాధిగ్రస్తులకు రెటినోపతి వ్యాధి సోకి క్రమంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుందని, కావున ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందించాలని సూచించారు. గతేడాది జిల్లాలోని ఇంటింటికీ వెళ్లి 30 ఏళ్ల వయస్సు పైబడిన వారందరికీ మధుమేహం వైద్య పరీక్షలు నిర్వహించి, దాదాపు 20 వేల మధుమేహం వ్యాధిగ్రస్తులను గుర్తించినట్లు తెలిపారు. వారందరికీ షెడ్యూల్డ్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఇందులో పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించాలన్నారు. అవసరమైన వారికి సరోజినీ ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్, పుష్పగిరి కంటి ఆస్పత్రి సికింద్రాబాద్‌కు సిఫారసు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్‌రెడ్డి, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామచంద్రరావు, ఉప వైద్య ఆరోగ్య అధికారి డా.శ్రీనివాసులు, ఆప్తాల్మాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 50 ఫిర్యాదులు
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యనాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి హాజరైన కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావానికి 50 దరఖాస్తులు వచ్చినట్టు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.


