అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు
పాన్‌గల్: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అకాల మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని పాన్‌గల్ బాలుర ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు, బహుజన రచయిత చింతకుంట కిరణ్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందెశ్రీతో సుమారుగా దశాబ్దానికి పైగా తనకు అనుబంధం ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఆనాడు తాను పనిచేస్తున్న గోపాల్‌పేట ఉన్నత పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులతో ముచ్చటించారని గుర్తు చేసుకున్నారు. గతేడాది సెప్టెంబర్ 25న పాన్‌గల్ బాలుర ఉన్నత పాఠశాలకు వచ్చి విద్యార్థులు రాసిన ‘ఫ్లయింగ్ బర్డ్స్’ అనే కవితా సంకలనం పుస్తకావిష్కరణకు హాజరై విద్యార్థులతో, ఉపాధ్యా యులతో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి అన్నారు.
ప్రజలు మరువలేరు
వనపర్తి టౌన్: అందెశ్రీ మరణం తెలంగాణ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మహానీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో అందెశ్రీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మహానీయుల స్ఫూర్తివేదిక రాష్ట్ర చైర్మన్ రాజారామ్‌ప్రకాశ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా కోశాధికారి బండారు కుమారస్వామి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి.అలివేలమ్మ, ఉపాధ్యక్షుడు బాశెట్టి శ్రీను, కవులు గిరిరాజాచారి, గంధం నాగరాజు, మండ్ల దేవన్ననాయుడు తదితరులు పాల్గొన్నారు.
అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు


