చట్టాలపై అవగాహన అవసరం
వనపర్తి టౌన్: విద్యార్థులు రాజ్యాంగం, చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి.రజని అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజ్యాంగం, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, బాల్య వివాహాల నిషేధ చట్టం, మోటార్ వాహనాల చట్టాలు, నిర్భంద విద్యా హక్కు చట్టం, డ్రగ్, పోక్సో చట్టాల గురించి వివరించారు. ఆర్టికల్ 39ఏ ప్రకారం ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని, ఉచిత న్యాయ సలహాల కోసం ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బాలయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, శ్రీదేవి, కళాశాల ప్రధానోపాధ్యాయుడు జగన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


