‘ఉద్యమాల వల్లే చెరుకుకు మద్దతు ధర పెంపు’
అమరచింత: కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో చెరుకు రైతులకు మద్దతుగా ఫ్యాక్టరీ యాజమాన్యంతో పలు దఫాలుగా నిర్వహించిన ఉద్యమం కారణంగానే చెరుకు పంటకు రూ.ఽ3,924 ధర లభించిందని ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న తెలిపారు. మండల కేంద్రంలోని మార్క్ భవనంలో సోమవారం విలేకరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా డ్రిప్‌పై సబ్సిడీ లేనందున చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ సంఘంగా ద్వారా సీఎం రేవంత్‌రెడ్డికి విన్నవించినట్లు తెలిపారు. డ్రిప్ సబ్సిడీని కొనసాగించడంతో పాటు టన్ను చెరుకుకు రూ.వెయ్యి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయగా.. సబ్సిడీపై డ్రిప్పు పరికరాలు వెంటనే మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న 9 రకాల సమస్యలపై పలు దఫాలుగా ఆందోళనలు నిర్వహించి యాజమాన్యాన్ని ఒప్పించామని పరిష్కారం చూపామని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి బకాయిలు పెట్టకుండా ఫ్యాక్టరీ నుంచి చెరుకు రైతులకు సకాలంలో డబ్బులు అందుతున్నాయన్నారు. సమావేశంలో వాసారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ఆంజనేయులు, రాజశేఖర్‌రెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.


