ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
విద్యతో పాటు విలువలు
పెంపొందించుకోవాలి
వనపర్తి: ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా ఎస్పీ తన కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను అప్పటికప్పుడు సంబంధిత స్టేషన్లకు కేటాయించి, వెంటనే చర్యలు తీసుకొని బాధితుల సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయానికి నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
పార్కింగ్ షెడ్ నిర్మాణం పనుల పరిశీలన
జిల్లా సాయుధ దళ పోలీస్ కార్యాలయం పక్కన పోలీసు వాహనాలు నిలిపేందుకు నిర్మిస్తున్న పార్కింగ్ షెడ్ పనులను ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనాల పార్కింగ్, భద్రతా ప్రమాణాలు, వర్షాకాలంలో రక్షణపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది సమయానికి, సమర్థవంతంగా ప్రజలకు సేవ చేయాలంటే వారికి మౌలిక వసతులు ఉండాలన్నారు. పోలీస్ శాఖ అభివృద్ధి అంటే ప్రజా సేవకు బలమైన పునాదని, సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
విద్యార్థులు విద్యతో పాటు విలువలు నేర్చుకున్నప్పుడే భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని నర్సింగాయపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో మై భారత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం మూడు రోజులుగా నిర్వహించిన బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేఎన్టీయూ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బీవీ రాంనరేష్‌యాదవ్, అసోసియేట్ ప్రొఫెసర్, సీహెచ్ ఆశాజ్యోతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజేందర్ గౌడ్, ప్రోగ్రాం వలంటరీ అవినాష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


