పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
పాన్‌గల్: తుపాను దాటికి వరి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని పాన్‌గల్, కేతేపల్లి, తెల్లరాళ్లపల్లి, చిక్కేపల్లి, వెంగళాయిపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటలను సీపీఐ బృందం ఆధ్వర్యంలో పరిశీలించారు. వరి పంటలు చేతికందే దశలో తుపాను వర్షాలతో తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. గత యాసంగిలో రైతులు విక్రయించిన సన్న ధాన్యానికి ఇప్పటికీ రూ.500 బోనస్ పడలేదన్నారు. రమేష్, డంగు కుర్మయ్య, బాలస్వామి, పెంటయ్య, రైతులు పాల్గొన్నారు.
ప్రైవేటు కళాశాలల బంద్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని ఉన్నత విద్య అందిస్తున్న పలు ప్రైవేటు కళాశాలలు సోమవారం మూతబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు అందించాల్సిన స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలను రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం నుంచి బంద్ పాటిస్తున్నాయి. ఈ మేరకు డిగ్రీ, పీజీ ఇంజినీరింగ్, బీఈడీ, డీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర కళాశాలల యాజమాన్యాలు జిల్లాకేంద్రంలో సమావేశమై.. పలు అంశాలపై చర్చించారు. పీయూ పరిధిలో మొత్తం 65 ఉన్నత విద్య అందిస్తున్న కళాశాలలు ఉండగా.. వీటితోపాటు రెండు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందినవారు కూడా పాల్గొన్నారు. అయితే ఈ నెల 8 నుంచి పీయూ పరిధిలోని పలు కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. బంద్ నేపథ్యంలో వీటిని వాయిదా వేస్తారా.. లేదా అనేది తేలాల్సి ఉంది.
● ఉమ్మడి జిల్లాలో మూతబడిన
65 డిగ్రీ, పీజీ, ఫార్మ కాలేజీలు
● పీయూ వీసీకి వినతిపత్రం అందించిన యాజమాన్యాలు


